సుమారు 18 సంవత్సరాలు మల్కాపూర్ గ్రామ రాజకీయాలను శాసించి, కొండాపూర్ మండల ప్రముఖ నాయకునిగా పేరుగాంచిన  జోగన్నగారి నర్సింలు గారు పద్మశాలి కులానికి చెందిన జోగన్నగారి లక్ష్మయ్య లక్ష్మమ్మ దంపతులకు 1952 సంవత్సరంలో రెండో సంతానంగా జన్మించారు. మెట్రిక్యులేషన్ విద్యను సంగారెడ్డిలో అభ్యసించారు.  శ్రీమతి వెంకటమ్మ గారిని వివాహం చేసుకున్నారు. నర్సింలు గారికి ఐదుగురు సంతానం  నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు (ప్రవీణ్).

    మల్కాపూర్ పోలీస్ పటేల్ గా తర్వాత పట్వారిగా కొన్ని సంవత్సరాలు పని చేశారు. 1988 లో జరిగిన సాధారణ పంచాయతీ ఎన్నికలలో మల్కాపూర్ ప్రజల ఆశీస్సులతో గ్రామ సర్పంచుగా విజయం సాధించారు.  మెరుగైన పాలనతో గ్రామ అభివృద్ధిలో ముందడుగు వేసి 1995 లో తన సహచరిణి అయిన శ్రీమతి వెంకటమ్మ గారిని తొలి మహిళా సర్పంచ్ గా  భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. 2001 సంవత్సరంలో జరిగిన మండల పరిషత్  ఎన్నికలలో మల్కాపూర్ గ్రామం నుండి ఎం.పీ.టీ.సీ. (MPTC) గా ఎన్నికై కొండాపూర్ మండల వైస్ ఎం.పీ.పీ పదవిని చేపట్టారు. అందరికీ ఆమోదయోగ్యమైన పాలనతో పాలనతో మల్కాపూర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నర్సింలు గారు, 2006 మే 24న లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో గుండె నొప్పితో పరమపదించారు.

         తన పదవీకాలంలో మంచినీటి ట్యాంకుల నిర్మాణం,  బోర్లు వేయించడం  ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు, కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు, మెరుగైన విద్యుత్ సౌకర్యం కోసం సబ్ స్టేషన్ ఏర్పాటు, మురుగునీటి కాలువల నిర్మాణానికి కృషి చేశారు. గ్రామస్తుల సహకారంతో ప్రాథమిక పాఠశాలకు ఒక ఎకరం స్థలాన్ని సమీకరించారు. 

         ప్రజల తగాదాలను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించేవారు, తగాదాలను తీర్చే సందర్భంలో  ముక్కు సూటిగా మాట్లాడి న్యాయం వైపు మాత్రమే నిలిచేవారు.  నర్సింలు  గారి హయాంలో పేదలకు న్యాయం జరిగిందని,  వాళ్ల జీవితాలు మెరుగుపడ్డాయని, గ్రామంలో మంచి పాలన ఉండేదని మల్కాపూర్ ప్రజలు అంటారు. మరణించి సుమారుగా 19 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ప్రజల నోట్లో నానే పేరు జోగన్నగారి నర్సింలు.